అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం ముగుస్తోన్న వేళ జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షమా భిక్షలు, శిక్ష తగ్గింపుల్లో దూకుడు కనబర్చుతున్న ఆయన, ఒక్కరోజే దాదాపు 1500 మంది ఖైదీలకు శిక్ష తగ్గించడంతోపాటు, 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఒకేరోజు ఈ స్థాయిలో క్షమాభిక్షలు కల్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
కరోనా వైరస్ విజృంభణ సమయంలో అనేక మంది ఖైదీలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. జైళ్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ చర్యలు చేపట్టింది. అప్పటికే ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరికి కొవిడ్ ఉన్నట్టు అంచనా వేసింది. ఇలా జైలు నుంచి విడుదలైన తరువాత కనీసం ఏడాదిపాటు గృహ నిర్బంధంలో ఉన్న వారికి జోబైడెన్ శిక్ష తగ్గించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అనేక మందికి శిక్ష తగ్గించారు. రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షలు తగ్గించడంతోపాటు, క్షమాభిక్ష పిటిషన్లనూ పరిశీలిస్తానని జోబైడెన్ పేర్కొన్నారు. అమెరికాలో ఒకే రోజు ఈ స్థాయిలో శిక్షలు తగ్గించడం ఇదే తొలిసారి.