
ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. బీజింగ్‌లో నిర్వహించిన ఫైనల్స్ పోటీల్లో షింజువా యూనివర్సిటీకి చెందిన టీహెచ్‌యూ రోబోటిక్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో టీహెచ్‌యూ జట్టు 5-3 స్కోర్‌తో చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన మౌంటేయిన్ సీ జట్టును ఓడించింది. పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి కలిగిన హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్‌బాల్ లీగ్‌ను నిర్వహించటం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. హ్యూమనాయిడ్ రోబోలతో కూడిన నాలుగు జట్లు, బీజింగ్‌లోని ఇజాంగ్ డెవలప్‌మెంట్ జోన్‌లో నిర్వహించిన రోబో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో తలపడ్డాయి. ప్రతి జట్టులోని మూడు హ్యూమనాయిడ్ రోబోలు ఏఐ టెక్నాలజీ, సెన్సార్లపై ఆధారపడి పోటీలో పాల్గొన్నాయి. ఎటువంటి మానవ జోక్యం, పర్యవేక్షణ లేకుండా రోబోలు తమ ఆట ఆడాయని నిర్వాహకులు చెప్పారు.
