భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైన విషయం తెలిసిందే. టారిఫ్‌ల విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ట్రంప్ విధించబోయే ప్రతీకార సుంకాల డెడ్‌లైన్ దగ్గరపడుతుండటంతో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ అంశంపై వైట్‌హౌస్ తాజాగా స్పందించింది.

ఈ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తూ, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీని వల్ల తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం కష్టతరమవుతోందని అన్నారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని.. అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు చేయబోతున్నారని వ్యాఖ్యానించారు.
