అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై భారీగా మంచు కురిసింది. దట్టమైన మంచు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఈ క్రమంలో ఒకదానికొకటి 50 నుంచి 60 వాహనాలు ఢీకొన్నాయి. హారిస్బర్గ్కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో ఉన్న షుయ్కిల్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ 81లో ఉదయం 10:36 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ 60 వాహనాల్లో కార్లతో పాటు ట్రాక్టర్ ట్రాలీలు కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. హైవేపై ఉన్న మంచును తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటన జరగడం ఒకే నెలలో ఇది రెండోసారి అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో నాలుగు ఆసుపత్రులకు తరలించినట్లు పెన్సిల్వేనియా స్టేట్ పోలీసులు తెలిపారు. ఇక్కడ శీతాకాలం మొదలుకాగానే వాతావరణం మంచుతో కప్పేస్తుండడంతో వాహనదారులకు రోడ్డు సరిగా కనిపించక ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.