Namaste NRI

ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం :  రాఘవేంద్రరావు

పాపులర్‌ యాంకర్‌ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం బబుల్‌గమ్‌. రవికాంత్‌ పేరెపు  దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన బబుల్‌గమ్‌ ప్రీ లుక్‌ పోస్టర్‌, సాంగ్స్‌, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, రానా దగ్గుబాటి సమక్షంలో విడుదల చేశారు. నా నసీబ్‌ ఏం రాసి పెట్టుందో నాకు తెల్వదు. కానీ నచ్చినట్లు మార్చుకుంటా. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా..అది ఇజ్జత్‌ అయినా..ఔకాత్‌ అయినా అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిని పంచింది. హీరో రోషన్‌ కనకాల డీజే పాత్రలో కనిపించాడు. ప్రేమలో విఫలమైన అతను తన ప్రతిభను ప్రపంచానికి తెలియజెప్పాలనే లక్ష్యాన్ని ట్రైలర్‌లో ఆవిష్కరించారు.

ట్రైలర్ విడుదల అనంతరం దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ సుమ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. బబుల్‌గమ్‌ ట్రైలర్‌లో సూపర్ హిట్ కళ కనిపిస్తోంది. బబుల్‌గమ్‌ మెల్లగా ఉబ్బి ఉబ్బి పెద్దగా పేలుతుంది. ఈ సినిమా టాక్ కూడా మెల్లగా స్టార్ట్ అయి సూపర్ హిట్ టాక్‌తో ఎండ్ అవుతుంది. రోషన్, మానస కెమిస్ట్రీ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా చాలా బాగా ఆడుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. పీపుల్ మీడియా నాకు సొంత కుటుంబం లాంటింది. వారి ద్వారా విడుదలైన సినిమాలన్నీ అద్భుతంగా ఆడాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

యువత మెచ్చే అన్ని అంశాలున్నాయని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ట్రైలర్‌ను రాఘవేంద్రరావు లాంచ్‌ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని హీరో రోషన్‌ పేర్కొన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ట్రైలర్‌ కంటే సినిమా ఇరవైరెట్లు ఉత్సాహాన్నిస్తుంది. చక్కటి వినోదంతో అలరిస్తుంది. శ్రీచరణ్‌ పాకాల అద్భుతమైన సంగీతాన్నందించాడు అన్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, తప్పకుండా అందరికి నచ్చుతుందని నిర్మాత వివేక్‌ కూచిభొట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events