అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ చిత్ర విజయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఇందుకు దర్శకుడు రాకేష్ శశికి థాంక్స్ చెప్పాలి. నా కంటే శిరిష్ సినిమాలు చూసేందుకు నాన్న అరవింద్ ఎక్కువ ఇష్టపడతారు. నా సినిమాల కంటే శిరీష్ చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటాను అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. శిరీష్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. వాళ్లిద్దరి విజయాలు చూస్తుంటే ఇంకే కావాలనిపిస్తుంటుంది అన్నారు. దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా అనుకున్నట్లుగా తెరపైకి వచ్చింది. అందరికీ నచ్చిన తర్వాతే విడుదల తేదీ ప్రకటించాం. శిరీష్, అనూ నటనకు ప్రశంసలు వస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాకేష్ శశి, నిర్మాత బన్నీవాసు, అనూఇమ్మాన్యుయేల్ , అల్లు శిరీష్ తదితరులు పాల్గొన్నారు.