ఆస్ట్రేలియాలో తెలుగు ప్రజల ఆదరణ చూరగొన్న తొలి తెలుగు ప్రవాస పత్రిక ‘తెలుగు పలుకు’ నాలుగో వసంతంలోకి ప్రవేశించింది. పూర్తిగా భారతదేశం వెలుపల ముద్రితమవుతున్న మొదటి మాస పత్రిగా గుర్తింపు పొందిన తెలుగు పలుకు.. మూడేండ్ల క్రితం దసరా పండుగ రోజున ఆస్ట్రేలియాలోని తెలుగు పాఠకులను పలుకరించింది. తొలి ప్రతి విడుదలై సెప్టెంబర్ 29న మూడేండ్లు పూర్తిచేసుకున్నది. నాలుగో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిన్నారుల కోసం ఆస్ట్రేలియా చందమామ అనే మాస పత్రికను కూడా ప్రారంభించింది. వార్షికోత్సవం సందర్భంగా పత్రిక వ్యవస్థాపక సంపాదకులు శ్రీనివాస్ గొలగాని శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రిక మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పత్రిక తెరిచాక ఆరు నుంచి అరవయ్యేళ్ల వయసు కలిగిన పాఠకుల్ని చదివించేలా తీర్చిదిద్దడం, స్థానిక ఆస్ట్రేలియా రచయితలు, ఆస్ట్రేలియా ఆధారిత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో తమ పత్రిక వ్యాప్తికి మరింత దోహదం చేసిందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా పత్రికను అనుబంధంగా సంవత్సర పంచాంగం, వినాయక వ్రతకల్పము వంటి అప్పుడప్పుడూ ఉచిత కానుకలు ఇవ్వడం పాఠకులను మరింత ఆకుట్టుకుంటున్నాయని పేర్కొంది. పిల్లల కోసం ఆస్ట్రేలియా చందమామను కూడా ప్రవేశపెట్టి ప్రపంచంలోనే తొలి ప్రవాస తెలుగు ద్విపత్రికను తీసుకొచ్చేందుకు సహాయపడిరదని శ్రీనివాస్ గొలగాని తెలిపారు.