సమర్వీర్ క్రియేషన్స్ పతాకంపై బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, సీనియర్ నటి ఇంద్రజ ప్రధాన పాత్రల్లో రూపొందించిన రజాకార్ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ నెల 24న నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాల్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాం. రేపటి తరాలు రజాకార్ల ఆకృత్యాల్ని తెలుసుకుని, అలాంటివాళ్లు రాకుండా జాగ్రత్త పడాలన్నదే ఈ సినిమా వెనక ఉద్దేశం అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా కు ఎన్నో అవార్డులొచ్చాయి. తెలంగాణ చరిత్రలో గొప్ప వీరులకు సంబంధించిన 20 కథలు నా దగ్గర ఉన్నాయి. అవకాశాన్ని బట్టి వాటిని సినిమాలుగా తెరకెక్కిస్తా అన్నారు. ఇంద్రజ మాట్లాడుతూ రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్రలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు.