చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ గాయకుడు పి.జయచంద్రన్(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కేరళ త్రిశ్శూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జయచంద్రన్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 16వేలకు పైగా పాటలు పాడారు.
తెలుగులో ఆయన పాడిన ఎన్నో పాటలు శ్రోతల్ని అలరించాయి. రోజావే చిన్ని రోజువే (సూర్యవంశం), హ్యాపీ హ్యీపీ బర్త్‌డేలు (సుస్వాగతం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వేకావాలి) ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో తెలుగు పాటలు ఆయన గళం నుంచి వెలువడి విశేషాదరణ పొందాయి. ఊరు మనదిరా (2022) చిత్రంలోని నా చెల్లి చంద్రమ్మ ఆయన తెలుగులో పాడిన చివరి పాట. జయచంద్రన్ మరణం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.