
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకుంటున్నాయి. కొత్త ఏడాది రోజున జర్మనీ లో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన తోకల హృతిక్ రెడ్డి గా గుర్తించారు. అతను ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లినట్లు తెలిసింది. హృతిక్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో, ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. హృతిక్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.















