కెనడా నుంచి అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించి ఓ భారతీయ కుటుంబం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 19న అమెరికా, కెనడా బోర్డర్లో ఈ ఘటన జరిగింది. కెనడా` అమెరికా సరిహద్దులో అధికారులు గస్తీ కాస్తుండగా మానవ అక్రమ రవాణా చేస్తున్న స్టీవ్ శాండ్ అనే అమెరికా పౌరుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తున్న క్రమంలో అమెరికా సరిహద్దులోని కెనాడా వైపు కొన్ని మృతదేహాలు కనిపించారు. వారిలో జగదీష్ బల్దేవ్భాయ్ పటేల్ (39), అతని భార్య వైశాలిబెన్ పటెల్ (37), కూతరు విహాంగి పటేల్ ( 11) కుమారుడు ధార్మిక్ పటేల్ (03) తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక నలుగురు మరణించారు. ఆ తర్వాతి రోజు మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు అధికారులు వీరి మృతదేహాలను బోర్డర్‌కు 12 మీటర్ల దూరంలో మంచులో కూరుకుపోయి ఉన్న స్థితిలో కనుగొన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ సందర్భంగా మానిటోబా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం మంచులో కూరుకుపోవడంతో ఊపిరాడక పోవడమే వారి మరణానికి కారణమని ధృవీకరించింది. ఈ మేరకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
వీరంతా టూరిస్టు వీసా మీద జనవరి 12న కెనడాకు చేరుకున్నారు. కెనడాలో చనిపోయిన జగదీశ్ కుటుంబం స్వస్థలం గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కలోల్ తహశీల్‌లోని దింగుచా గ్రామంగా తెలిసింది. ఈ గ్రామం నుంచి చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారు. కొందరు అధికారిక పత్రాలతో వెళ్లి విదేశాల్లో సెటిలవగా మరికొందరు టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విదేశాల్లో జీవించడం ఈ గ్రామంలో గౌరవంగా పరిగణిస్తారు. మరోవైపు జగదీశ్ కుటుంబం కెనడా వెళ్లిన తర్వాత నుంచి గుజరాత్లో ఉన్న అతని కుటుంబం ఆందోళన చెందుతోంది. జనవరి 12 నుంచి జగదీశ్ ఫోన్లో అందుబాటులో లేడని అతని తండ్రి బల్దేవ్ ఆందోళన చెందుతున్నాడు. ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది.














