ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వ్యక్తి చేతుల్లో ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కాగా ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాను ద్వేషించే ర్యాడికల్ లెఫ్ట్ ఉన్మాదుల నిర్వహణ నుంచి ట్విట్టర్ బయటకు వచ్చింది. ఈ విషయాలపై చాలా సంతోషంగా ఉంది. సంస్థను తీవ్రంగా దెబ్బతీసిన నకిలీ ఖాతాలు, ఇతరత్రా కార్యకలాపాలను వదిలించుకోవడానికి ట్విట్టర్ కృషి చేయాలన్నారు.
