బ్రిటన్ ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్) సభ్యుడిగా ఎంపికైన ప్రవాస భారతీయుడు ఉదయ్ నాగరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రస్థానాన్ని కొనియాడారు. ఇంగ్లండ్ రాజు చేతుల మీదుగా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నామినేట్ అయినందుకు ఉదయ్ నాగరాజు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. యూకేలో పబ్లిక్ ఆఫీస్ కోసం పోటీ చేయడం దగ్గరి నుంచి మొదలుకొని, నేడు ఈ అరుదైన గౌరవం దక్కించుకోవడం వరకు ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కొత్త బాధ్యతల్లో మీకు అంతా మంచే జరగాలని, మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

ఉదయ్ నాగరాజు స్వస్థలం సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో హనుమంత రావు-నిర్మలాదేవి దంపతులకు జన్మించారు. ఆయన వరంగల్, హైదరాబాద్‌లో చదువుకున్నారు. బ్రిటన్‌లోని ప్రముఖ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు.















