తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 30న లండన్‌లోని నవనాథ్ సెంటర్ ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణీ హాజరయ్యారు. తాల్ వార్షిక పత్రిక మా తెలుగు సావనీర్‌ను భరణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకేలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో తాల్ చేస్తున్న కృషిని కొనియాడారు. తన జీవిత విశేషాలను సభకు వచ్చిన వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తాల్ ప్రత్యేకంగా నివాళులర్పించింది. తనికెళ్ల భరణి తన ప్రసంగంలో సిరివెన్నెల కవితా ప్రయాణం సాహితీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలుస్తుందని కొనియాడారు.
జబర్దస్ ఆర్టిస్టులు రాంప్రసాద్, రోహిణి, భాస్కర్ యాంకరింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు ధనుంజయ్, దామిని తమ గాత్రంతో మైమరిపించారు. తెలుగు నవల రచయిత నరేంద్ర మధురాంతకం మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో తాల్ చేస్తున్న కృషిని కొనియాడారు. నల్గొండ గద్దర్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జానపద గాయకుడు కాసాల నర్సన్న తాల్ కోసం ప్రత్యేక పాటను పాడారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని కొమురం భీముడో పాటను తనదైన శైలిలో పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారత హైకమిషన్ రెండవ కార్యదర్శి సంజయ్ కుమార్ నరేంద్రను ఈ కార్యక్రమంలో సత్కరించారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన యూకే పార్లమెంటు సభ్యులు సీమా మల్హోత్రా, వీరేంద్ర శర్మ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతిని రాబోయే తరాలకు అందించడానికి తాల్ చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన రవి సబ్బా సహకారంతో వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య స్పాన్సర్‌లుగా శుభోదయం గ్రూప్, లియో గ్లోబల్ సర్వీసెస్, మార్ట్‌గేజ్ అవెన్యూ, శక్తి క్యాష్ అండ్ క్యారీ తదితరులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తాల్ చైర్‌పర్సన్ భారతి కందుకూరి, వైస్ చైర్మన్, కోశాధికారి రాజేష్ తోలేటి, ట్రస్టీలు గిరిధర్ పుట్లూరి, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదం సేతి, కస్తూరి కిశోర్ పాల్గొన్నారు.