విదేశాల్లోని విశ్వవిద్యాలయాల తరహాలోనే ఇక నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఏటా రెండుసార్లు అడ్మిషన్లు జరపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని యూజీసీ ఛైర్మన్ ఆచార్య జగదీశ్ కుమార్ తెలిపారు. తొలి విడతలో జులై-ఆగస్టు, మలి విడతలో జనవరి-ఫిబ్రవరిలలో అడ్మిషన్లు జరుగుతా యని వెల్లడించారు.అయితే ఈ విధానం తప్పనిసరి కాదని, ఐచ్ఛికమేనని స్పష్టం చేశారు.
ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ల విధానం అమల్లోకి తేవడంతో, వివిధ బోర్డుల ఫలితాల ప్రకటనలో జాప్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలవల్ల జులై-ఆగస్టులలో ప్రవేశాలు పొందలేని విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులు మరుసటి ఏడాది వరకూ వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ద్వైవార్షిక ప్రవేశాలవల్ల కంపెనీలు ప్రాంగణ నియామకాలను ఏడాదికి రెండుసార్లు చేస్తాయి. దాంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని జగదీశ్ కుమార్ వివరించారు. రెండుసార్లు ప్రవేశాలు జరపడంవల్ల విద్యాసంస్థలు తమ వనరులను సమర్థంగా పంపిణీ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, తరగతి గదులు, ఇతర అవకాశాలను సమర్థంగా వినియోగించు కోవచ్చు. ఫలితంగా వర్సిటీల వ్యవస్థలు అత్యుత్తమంగా పని చేయగలుగుతాయి అని యూజీ ఛైర్మన్ తెలిపారు.