ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. రష్యా బాంబుల మోత మోగిస్తూ ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో భారత్ సాయం కావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు మోదీని కోరారు. ప్రస్తుత పరిస్థితుల గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్విట్టర్ వేదికగా వెల్లడిరచారు. ఐరాసలో భద్రతా మండలిలో తమకు రాజకీయంగా మద్దతు కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. రష్యా దాడులు ఆపేలా తగిన చర్యలు తీసుకోవాని మోదీని కోరారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. రష్యా దురాక్రమణ, ఉక్రెయిన్ తిప్పికొడుతున్న విధానాన్ని ఆయనకు వివరించాను. సుమారు లక్ష మంది ఆక్రమణ దారులు ఉక్రెయిన్లోనే ఉన్నారు. నివాస భవనాలపై బాంబు దాడులు చేస్తున్నారు. భద్రత మండలిలో రాజకీయ మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరాను అంటూ జెలెన్స్కీ ట్వీట్టర్లో పేర్కొన్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా జరిగే ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఫోను సంభాషణల్లో ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం దాడులు ఆపి, చర్చలు ప్రారంభించాలని సూచించారు. శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సాయం అందించడానికైనా భారత్ సిద్ధంగా ఉన్నట్టు మోదీ తెలియజేశారు. అదే సమయంలో ఉక్రెయిన్లోని భారత ప్రజల భద్రతపై కూడా ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ పౌరులను సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి పంపేందుకు ఉక్రెయిన్ అధికారులను వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు.














