తమ భూభాగం నుంచి రష్యా బలగాలు తక్షణమే వైదొలగాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అమోదించింది. ఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మరోవైపు, ఉక్రెయిన్ సమస్యను త్వరగా పరిష్కరించే ఉద్దేశంతో రష్యాతో అకస్మాత్తుగా ట్రంప్ చర్చలు జరపడంతో అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు తలెత్తాయి. మాస్కోతో సంబంధాలపై ట్రంప్ ప్రభుత్వ అసాధారణ రీతిలో వైఖరిని మార్చుకోవడంతో యూరప్ కూటమితో కూడా అమెరికాక సంబంధాలు ఇబ్బందుల్లో పడ్డాయి.

గత వారంలో జరిగిన ప్రాధమిక చర్చల్లో తమను, ఉక్రెయిన్‌ను బహిష్కరించారంటూ యురోపియన్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఉక్రెయిన్‌పై ఐక్యరాజ్య సమితి పెట్టే తీర్మానాన్ని తాము సమర్ధించేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తీర్మానానికి పోటీగా చివరి నిముషంలో తమ స్వంత తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానికి మద్దతునివ్వాలని మిత్రపక్షాలను కోరుతున్నారు. భద్రతా మండలిలో కూడా తమ ప్రతిపాదనను ఓటింగ్‌కు పెట్టాలని అమెరికా భావిస్తోంది.
