ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చకు తాను సిద్ధమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తానని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై తాను చెప్పిన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, ఖరీఫ్ దిగుబడి నుంచి ప్రతి గింజా కొంటామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సీనియర్ పాత్రికేయుల సమక్షంలో ముఖ్యమంత్రితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. చర్చ కోసం ఎవరూ ఢల్లీి రావాల్సిన అవసరం లేదని, తానే హైదరాబాద్ వస్తానని అన్నారు. అయితే బూతులు మాట్లాడకుండా, నాగరిక భాష ఉపయోగించే పక్షంలోనే తాను చర్చలో పాల్గొంటానని ప్రకటించారు. తాను బూతుల్లో కేసీఆర్‌తో పోటీపడలేదని, పోటీ పడితే ఓడిపోతానని తెలిపారు. ఈ విషయం ముందే అంగీకరిస్తున్నానని అన్నారు. శని, ఆదివారల్లో ఎప్పుడంటే అప్పుడు చర్చకు వస్తానన్నారు.
రెండు నెలలుగా కల్లాల్లో రోడ్లపై ధాన్యం కుప్పలతో బాధపడుతున్న రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాకే చివరి బస్తా వరకు కొంటామని తెలిపారు. యాసంగి పంట అంశం ముందు వానాకాలం పంట కొనుగోలు చేయాలని సూచించారు. హుజారాబాద్ ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి అభద్రతా భావంతో ఉన్నందునే గంటన్నర పాటు తిట్లపురాం కొనసాగించారని ఎద్దేవా చేశారు. సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చిన వ్యక్తి అంతకాన్న గొప్పలా ఎలా మాట్లాడుతారన్నారు. తాను కేంద్ర మంత్రి అయినందుకు కేసీఆర్ బాధ పడితే తానేం చేయలేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విత్తనాలు మార్చుకున్నారని, ఆలానే విత్తనాలు మార్చుకుంటే యాసంగి పంట వేయెచ్చన్నారు.