వివిధ దేశాధినేతలతో మంతనాలు, ఉన్నతాధికారులతో చర్చలు వంటివాటితో క్షణం తీరిక లేకుండా గడిపే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాసేపు సరదాగా బీచ్‌లో గడిపారు. సూటు, బూటు, టై వంటి జంఝాటాలను వదిలేసి, ఏసీ గదుల జీవితాన్ని వీడి, సూర్య కిరణాల నునులేత వెచ్చదనాన్ని ఆస్వాదించారు. శరీరం పై భాగంలో వస్త్రాలేవీ లేకుండా, చలువ కళ్లద్దాలు ధరించి, ఇసుక తిన్నెలపై కలియదిరిగారు. 80 ఏళ్ల జో బైడెన్ ప్రస్తుతం డెలావర్ లోని రెహోబోత్ వద్ద ఉన్న బీచ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కాసేపు బీచ్ లో సరదాగా గడిపారు. తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి కాసేపు సముద్ర తీరాన సేదతీరారు. లాంగ్ బ్లూ స్విమ్మింగ్ ట్రంక్స్, బ్లూ టెన్నిస్ షూస్, బ్యాక్ వార్డ్స్ బేస్ బాల్ క్యాప్, ఆవియేటర్ సన్ గ్లాసెస్ ధరించారు. తీరంలోని ప్రకృతిని ఆస్వాదిస్తూ బీచ్ లో కలియదిరిగారు.