భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయం భారతీయులకు షాకిచ్చింది. తాజాగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసింది. అపాయింట్‌మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ కారణంగా ఏకంగా 2 వేల యూఎస్ వీసీ దరఖాస్తులను రద్దు చేసినట్లు ప్రకటించింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండటంతో వీటిని రద్దు చేసినట్లు తెలిపింది. ఈ అపాయింట్‌మెంట్లు అన్నీ బాట్స్ ద్వారా వచ్చినట్లు గుర్తించినట్లు పేర్కొంది.

బాట్స్ చేసిన 2 వేల వీసా అపాయింట్‌మెంట్లను భారత్‌లోని కాన్సులర్ టీం రద్దు చేస్తోంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్‌లను ఏమాత్రం సహించేది లేదు. ఈ అపాయింట్‌మెంట్లను రద్దు చేయడంతో పాటు, ఆయా సంబంధిత ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను కూడా సస్పెండ్ చేస్తున్నాం అని దౌత్య కార్యాలయం పేర్కొంది.
