2024 ఆర్థిక సంవత్సరానికి జారీచేయాల్సిన హెచ్-1బీ విదేశీ ఉద్యోగ వీసాల పరిమితిని చేరుకునేందుకు తగినన్ని దరఖాస్తులు అందినట్టు అమెరికా యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. వృత్తి నైపుణ్యం గల ఉద్యోగాలకు విదేశీ ఉద్యోగులు, కార్మికులను అమెరికన్ కంపెనీలు నియమించుకోవ డానికి ఉద్దేశించిన హెచ్ 1బి వీసాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 మధ్య కాలానికి నిర్దేశించిన 65 వేల సాధారణ హెచ్-1బీ వీసాలు, 20 వేల హెచ్-1బీ అడ్వాన్స్‌డ్ డిగ్రీ (మాస్టర్స్) వీసాల పరిమితిని చేరుకునేందు కు తగిన దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించింది. ఈ వీసాలకు ఎంపికకాని దరఖాస్తుదారులకు కొద్ది రోజుల్లో వారి ఆన్‌లైన్ ఖాతాల ద్వారా నాన్-సెలక్షన్ నోటీసులు పంపుతామని, పరిమితి నుంచి మినహాయించిన పిటిషన్ల స్వీకరణ, ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.