
యూకేలోని బర్మింగ్‌హామ్‌లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జెండాలు, కోలాటాలతో బాల శివ గణపతిని బింగ్లీ హాల్‌లోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం వేద పండితులు ఘనంగా పూజలు నిర్వహించారు. సుమారు మూడు వేలకు పైగా భక్తులతో ప్రాంగణం కోలాహలంగా మారింది. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల నాట్య ప్రదర్శన అలరించింది. సుమారు 15 రకాల వంటకాలతో కార్యక్రమానికి హాజరైన వారికి సంప్రదాయ అరిటాకు భోజనం ఏర్పాటు చేశారు. లడ్డూ వేలంపాటలో భాగంగా భక్తులంతా సిండికేట్‌గా ఏర్పడి 5700 పౌండ్లకు పాడి లడ్డూను అందరూ కలిసిపంచుకున్నారు. అనంతరం పోలీస్ ఎస్కార్ట్, ప్రత్యేక డోలు వాయిద్యాల సందడి మధ్య బర్మింగ్‌హామ్ కాలువలో నిమజ్జనం జరిపించారు. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు ఉత్సవ కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాన్ని చూసేందుకు స్థానిక పోలీసు కమీషనర్‌తో పాటు అసిస్టెంట్ పోలీసు కమీషనర్ వచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.















