అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం కోసం భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఆయన ప్రచారంలో దూసుకెళ్తు న్నారు. కేవలం ఆరు రోజుల్లోనే 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వచ్చేవారం కూడా 38 ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ప్రచార కార్యక్రమా ల్లో వివేక్ రామస్వామి చురుగ్గా పాల్గొంటున్నారని, మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే చాలా ముందున్నారు.
వివేక్ రామస్వామిని మాట్లాడుతూ తన ప్రచారానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే, నూతనోత్తేజం పొంగుకొస్తుందని తెలిపారు. దేశం పట్ల వాళ్లకు ఉన్న శ్రద్ధే తనను ఇంతగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రచార కార్యక్రమాల ద్వారా ఒక బలమైన కమ్యూనిటీ నిర్మాణం జరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. టీవీలు, సోషల్‌మీడియాల్లో ప్రచారం చేసినా కూడా ఈస్థాయి ప్రచారం జరగడం అసాధ్యమని పేర్కొన్నారు. పార్టీ విరాళాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం కంటే కూడా పిజ్జా అవుట్‌లెట్ల వద్ద సాధారణ ప్రజలతో ముచ్చటించడమే ఉత్తమమైన మార్గమని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలతో మమేకం కావడానికి ఇదే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎన్నికవ్వడం పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.