వచ్చే ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే 75 శాతం వరకూ ప్రభుత్వ ఉద్యోగులను తీసివేస్తాను. అధికారిక దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐని మూసివేయిస్తానని రిపబ్లికన్ అభ్యర్థి, ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి ప్రకటించారు. ఎఫ్‌బిఐ ఒక్కటే కాదు పలు ఇతర సంస్థలపై కూడా వేటేస్తానని వివరించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆయన ఇప్పుడు పార్టీ అంతర్గత ప్రైమరీ పోటీల్లో ఉన్నారు. ఈ ఇండో అమెరికన్ అమెరికాలో అత్యంత సంపన్నుడైన యువ పారిశ్రామికవేత్తగా నిలిచారు. సంస్కరణల భాగంగా తాను పలు ప్రతిపాదనలకు దిగుతానని వివేక్ రామస్వామి తెలిపారు. ముందు ఫెడరల్ ఉద్యోగులను తీసివేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యాశాఖ, ఎఫ్‌బిఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టోబాకో, మారణాయుధాలు పేలుడు పదార్థాలు, ఎన్‌ఆర్‌సి, ఐఆర్‌ఎస్, వాణిజ్య విభాగం ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. పదవిలోకి వచ్చిన రోజునే ఈ పనిచేస్తానని తెలిపిన వివేక్ రామస్వామి ఏడాదిలోగా ఫెడరల్ ఉద్యోగులలో 50 శాతం ఇంటికి వెళ్లేలా చేస్తానని చెప్పారు. ఈ ఉద్యోగులలో దాదాపు 30 శాతం వరకూ వచ్చే ఐదేళ్లలో రిటైరయ్యే వారే ఉన్నారని వివరించారు. బ్యూరోక్రసీలో ప్రస్తుతం నెలకొన్న అలసత్వం గమనించే తాను ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
