సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్ , ఫేస్బుక్ మెటా మధ్య తీవ్రస్థాయి వార్ నెలకొంది. మెటాలో ఇటీవలే కొత్తగా సంక్షిప్త సందేశాల యాప్ థ్రెడ్స్‌ను ప్రవేశపెట్టడం, వారం రోజుల్లోనే దీనికి కోట్లాది యుజర్ల బలం చేకూరడం జరిగింది. దీనిపై ట్విట్టర్ తీవ్రంగా స్పందించింది. చట్టపరమైన చర్యకు దిగుతామని, కోర్టుకు ఈడుస్తామని తెలిపింది. ట్విట్టర్ లాయర్ అలెక్స్ స్పైరో ద్వారా తాజాగా మెటా సిఇఒ మార్క్ జుకెర్‌బెర్గ్‌కు ముందుగా నిరసన లేఖను పంపించారు.

తమ ట్విట్టర్ మెస్సెజ్‌ల ప్రక్రియను , వ్యాపార రహస్యాలను , మేధోపరమైన సంపత్తిని కాజేసేందుకు మెటా యత్నించిందని, దీనిపై కోర్టుకు వెళ్లుతామని తెలిపారు. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను తీసుకుని వారి ద్వారా ఈ నకిలీ కాపీక్యాట్ యాప్‌ను సృష్టించారని, ఇది పూర్తిగా తమ డేటా తస్కరణ కిందికి వస్తుందని లాయర్ మెటా సిఇఒకు లేఖ పంపించారు. ఇటీవలే మెటా నుంచి థ్రెడ్స్ యాప్ ఆరంభం అయింది.

