సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీ కెమ్ ప్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడిందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నాసిర్ కనానీ ఒక ప్రకటన విడుదల చేశారు.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న సహకారం నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ విమర్శించింది. వాణిజ్య నౌకపై దాడి ఇరాన్ భూభాగం పైనుంచే జరిగిందని పెంటగాన్ వెల్లడించిన మరుసటి రోజే ఇరాన్ ఈ ప్రకటన చేసింది. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది.














