వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు, దౌత్యం మాత్రమే పరిష్కారమార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రష్యాలోని కజన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. యుద్ధానికి మద్దతివ్వం అని ఆయన పేర్కొన్నారు. వివాదాలు, ప్రతికూల వాతావరణ ప్రభావాలు, సైబర్ ముప్పు వంటి అనేక సవాళ్ల నడుమ జరుగుతున్న బ్రిక్స్ సదస్సుపై చాలా అంచనాలు ఉన్నాయి అని అన్నారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి నిధులు సమకూరకుండా అడ్డుకునేందుకు మాకు అందరి బలమైన మద్దతు కావాలి. ఈ తీవ్రమైన అంశంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు అని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.