అఖిల్ రాజ్, తేజస్వీ రావు జంటగా నటించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు కంపాటి దర్శకుడు. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్‌లపై దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలవడంతోపాటు పలు వ్యక్తిగత పురస్కారాలను కూడా గెలుచుకున్న రూరల్ తెలంగాణ ప్రేమకథ రాజు వెడ్స్ రాంబాయి చిత్రాన్ని అభినందిస్తూ హైదరాబాద్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేషన్ హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ నేను చూసిన జీవితాల ఆధారంగా రాసుకున్న ఈ కథ నన్ను ఇంత దూరం తీసుకొస్తుందని అనుకోలేదు. సినిమాకు డబ్బులొస్తే చాలు అనుకున్నా.ఇన్ని అవార్డులు కూడా వస్తాయని ఊహించలేదు. ముఖ్యంగా క్రిటిక్స్ నుంచి అభినందనలు వస్తే ఆ కిక్కే వేరు. మరింత బాధ్యతతో మరిన్ని మంచి సినిమాలని నిర్మిస్తాం అని అన్నారు.

ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ సినిమాను ప్రశంసిస్తున్న జర్నలిస్ట్ మిత్రులకు ధన్యవాదాలనీ, ఈ సినిమాకు లభించిన అవార్డులకంటే, మీ అభినందనలే విలువైనవనీ చిత్ర నిర్మాత వేణు ఊడుగుల అన్నారు. ఇంకా చిత్ర సమర్పకులు నాగేశ్వరరావు పూజారి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాహుల్ మోపిదేవిలతోపాటు నటులు శివాజీరాజా, చైతూ జొన్నలగడ్డ, నటి అనితా చౌదరి, సీనియర్ పాత్రికేయులు ప్రభు, బత్తుల జేవీ ప్రసాద్, సురేశ్ కొండేటి కూడా పాల్గొన్నారు.















