
వాణిజ్యం, ఇంధన సంబంధిత అంశాల్లో భారత్ తీసుకునే చర్యల్లో తాము జోక్యం చేసుకోబోమని, వాటిపై స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆ దేశానికి ఉన్నదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం లవ్రోవ్ మీడియాతో మాట్లాడారు.ఈ ఏడాది డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇరు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక అజెండా ఉందని చెప్పారు. వాణిజ్యం, సైనిక, సాంకేతికత, కృత్రిమ మేథ వంటి కీలక విషయాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య జరిగే సాధారణ దౌత్య చర్చల్లో భాగంగా ఈ ఏడాదిలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో పర్యటించే అవకాశం ఉందని, తాను కూడా భారత్‌లో పర్యటిస్తానని తెలిపారు. వాణిజ్యం, ఇంధన సంబంధిత అంశాల్లో భారత్ చర్యల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టంచేశారు. వాటిపై స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. చమురు వాణిజ్య విధానాలపై భారత వైఖరిని ఆయన కొనియాడారు.
















