రోషన్, శ్రీలీల జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం పెళ్లి సందడి. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 1996లో శ్రీకాంత్ హీరోగా చేసిన పెళ్లిసందడి ఘన విజయం సాధించింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న ఈ పెళ్లి సందడి చిత్రం ఆ సినిమాలాగా సందడి చేస్తుందని భావిస్తున్నాను అని అన్నారు. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ దసరాకు దర్శకేంద్రుడు దుమ్ములేపేస్తాడని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అని పేర్కొన్నారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఈ చిత్రంలో నేను చిన్న రోల్ చేశాను. కొత్త హీరో హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది అని అన్నారు.
రాఘవేంద్రరావు చేతుల మీదుగా తన కుమారుడు హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని, ప్రేక్షకులు రోహన్‌ను ఆశీర్వదించాలని శ్రీకాంత్ కోరారు. రాఘవేంద్రరావు సాధించిన విజయాల్లో పదిశాతం సాధిస్తే చాలనే భావన కలుగుతున్నదని దిల్ రాజ్ చెప్పారు. ఈ సినిమా ద్వారా తాను ఎన్నో విషయాల్ని నేర్చుకున్నానని హీరో రోషన్ పేర్కొన్నారు. ఈ మూవీని రాఘవేంద్ర శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెల మూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.