హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు సున్నితమైనవి, సాధారణమె నవేనని శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని వేరెవరో భర్తీ చేయాలన్నది ట్రంప్ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. అధ్యక్ష భవనం పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ పాత్రికేయులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యక్తంచేసే అభిప్రాయాలను తరచూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. హెచ్-1బీ వీసాదారులపై అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ అమెరికాలో పెట్టుబడులుపెట్టే విదేశీ కంపెనీలు దీర్ఘకాలంలో అమెరికన్లను నియమించుకో వాలన్నది ట్రంప్ ఉద్దేశమని వివరించారు. అయితే బ్యాటరీలు, చిప్ ప్లాంట్ల వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలంటే ప్రారంభ దశలో కంపెనీలు విదేశాల నుంచి నిపుణులను రప్పించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్‌ది చాలా సున్నితమైన, సాధారణ అభిప్రాయం. విదేశీ కంపెనీలు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడితే అవి తమతో పాటు విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకురావాలని ట్రంప్ ఆశించారు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన పరిశ్రమలకు వారి అవసరం ఉంటుంది. ప్రారంభదశలో ఫ్యాక్టరీలలో ఉత్పత్తికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి, ఆ తర్వాత ఆయా ఫ్యాక్టరీలు నడవడానికి వారి సేవలు అవసరమవుతాయని ట్రంప్ అనుకుంటున్నారు అని లీవెట్ తెలిపారు.
















