కరోనా ముప్పు ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, కానీ ఆ మప్పు నుంచి ఇంకా బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) హెచ్చరించింది. గత వారం 31 లక్షల మందికి కరోనా సోకిందని, 54 వేల మరణాలు సంభవించాయని వెల్లడిరచింది. వాస్తవంగా ఈ లెక్కల కన్నా మరింత ఎక్కువ మందే కరోనా బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాను అంతమొందించేందుకు మనవద్ద అనేక సాధనాలున్నా సరిగ్గా వినియోగించడం లేదని, కొన్ని ప్రాంతాల్లో ఐసియులు, ఆస్పత్రులు నిండిపోతున్నాయని, ప్రజలు చనిపోతున్నారని కానీ కొందరు మాత్రం కరోనా ముగిసి పోయిందని నటిస్తూ తిరిగేస్తున్నారని ఆరోగ్య సంస్థకు చెందిన మారియా వ్యాన్ కెర్కోవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
దాదాపు రెండేళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది కరోనాకు బలయ్యారు. కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారిలోనే మరణాలు సంభవిస్తున్నాయని మారియా వెల్లడిరచారు. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాల రేటు, టీకా తీసుకోని వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కరోనా వైరస్ టీకా గురించి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న తప్పుడు సమాచారం తీవ్ర ప్రభావం చూపుతోందని అసహనం వ్యక్తం చేశారు.