అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. పెంచిన సుంకాలు త్వరలో అమల్లోకి రానున్నాయి. ట్రంప్ టారిఫ్‌లతో ఆయా దేశాలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని మెలోనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్య ఒప్పందం అంశంపై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టారిఫ్‌లతో ఆదాయం వస్తోందన్నారు. టారిఫ్ డీల్ విషయంలో తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించారు. ఆ ఒప్పందాలు ఓ నిర్దిష్ట సమయంలో జరుగుతాయన్నారు. ఈయూ, ఇతర దేశాలతో డీల్స్ చేసుకోవడం చాలా సులువే అని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో వంద శాతం ఒప్పందం జరుగుతుందని హామీ ఇచ్చారు.
