ఇరాన్‌తో సాగిస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వడంపై ఐరోపా మిత్రదేశాల నుంచి వరుస ఎదురుదెబ్బలు తిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఒకప్పుడు అమెరికా ఏర్పాటు చేసిన సైనిక కూటమి నాటో నుంచి నిష్క్రమించాలన్న సంచలన ఆలోచనను బయటపెట్టారు. ఇరాన్‌తో యుద్ధంలో తమతో చేతులు కలుపడానికి నిరాకరించిన తర్వాత నాటో నుంచి అమెరికాను బయటకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంలో నాటో దేశాల నుంచి ఎటువంటి సహాయం లేదని ఇటీవల పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, నాటో నుంచి తనకు ఎటువంటి సహాయం అవసరం లేదని తెగేసి చెప్పారు.

నాటో సైనిక కూటమిని కాగితం పులిగా అభివర్ణించిన ట్రంప్ ఈ కూటమి నుంచి బయటపడాలన్న ఆలోచనను పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ యుద్ధం తర్వాత నాటోలో అమెరికా సభ్యత్వం గురించి పునరాలోచిస్తారా అన్న ప్రశ్నకు తాను నాటోతో ఎన్నడూ అంట కాగలేదని ఆయన తెలిపారు. అది కాగితం పులి అన్న విషయం తనకు ఎప్పటి నుంచో తెలుసని, ఆ విషయం పుతిన్‌కు కూడా తెలుసని ట్రంప్ చెప్పారు. పశ్చిమ దేశాల్లోని తన మిత్ర దేశాల నుండి ఎదురైన పలు ఎదురుదెబ్బలు, ముఖ్యంగా ఫిబ్రవరి 28 తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నాటో దేశాల పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు.















