కమల్‌హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం విక్రమ్. కాగా ఈ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో కమల్ కొందరికి బహుమతులు ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే లోకేష్‌కు ఖరీదైన కారును బహుమానంగా అందించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరో సూర్య అతిథి పాత్ర చేశారు. ఇందులో సూర్య పాత్ర పేరు రోలెక్స్. కమల్ తన సొంత రోలెక్స్ వాచ్‌ని సూర్యకి బహుమతిగా ఇచ్చారు. ఇలాంటి క్షణాలు జీవితాన్ని అందంగా మార్చుతాయి థ్యాంక్స్ అన్నా అని కమల్ని ఉద్దేశించి ట్విట్టర్లో పేర్కొన్నారు సూర్య. విక్రమ్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కోసం సూర్య ఏవిధమైన రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది.














