తరచూ డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై అమెరికన్ టైకూన్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి స్పందించారు. మాదకద్రవ్యాలను వినియోగించినట్లు తాజాగా అంగీకరించారు. డిప్రెషన్ వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్యుడి సూచనల మేరకు కెటమిన్ అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తెలిపారు. టెస్లా కంపెనీ నిర్వహణలో డ్రగ్స్ వినియోగం తనకు ఉపయోగపడిందని ఆయన వెల్లడించారు.
గతంలో ఓ సారి మానసిక కంగుబాటుకు గురైనట్లు మస్క్ చెప్పారు. ఆ సమయంలో దాన్నుంచి బయట పడేందుకు కెటమిన్ తనకు చాలా ఉపయోగపడిందన్నారు. వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి చిన్న మొత్తంలో దాన్ని తీసుకునేవాడినని వెల్లడించారు. రోజుకు 16 గంటలు పనిచేస్తుంటాను. దాంతో నాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. నేను ఎక్కువ కాలం మానసిక కుంగుబాటులో ఉంటే టెస్లా పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాన్ని అధిగమించేందుకు కెటమిన్ తీసుకున్నా అని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా కెటమిన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏ పనీ సక్రమంగా పూర్తి చేయలేరని మస్క్ తెలిపారు.