చైనా సంపన్నుల జాబితాలో బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ టాప్ ప్లేస్ కొట్టేశాడు. అతని వ్యక్తిగత సంపద 49.3 బిలియన్ల డాలర్లుగా ఉన్నది. ఈసారి చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంపన్నుల జాబితాలో వెనుకపడిపోయారు. 2021లోనే బైట్‌డ్యాన్స్ ఈసీవో బాధ్యతల నుంచి జాంగ్ తప్పుకున్నారు. హురన్ చైనా సంపన్నుల జాబితా ప్రకారం గడిచిన 26 ఏళ్లలో రిచెస్ట్ పర్సన్‌గా నిలిచిన 18వ వ్యక్తిగా జాంగ్ నిలిచాడు.
వాటర్ బాటిల్ వ్యాపారి జోంగ్ షాన్‌షాన్‌ను బైట్ డ్యాన్స్ ఓనర్ దాటేశాడు. రెండో స్థానంలో నిలిచిన షాన్‌షాన్ సంపద 47.9 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. అతని ఆస్తి విలువ 24 శాతం పడిపోయింది. బైట్‌డ్యాన్స్ సంస్థకు అమెరికాలో న్యాయపరమైన సమస్యలు ఉన్నా, ఆ సంస్థ రెవన్యూ గత ఏడాది 30 శాతం పెరిగింది. మూడవ స్థానంలో టెన్సెంట్ వ్యవస్థాపకుడు పోనీ మా, నాలుగవ స్థానంలో పీడీడీ హోల్డింగ్స్ ఫౌండర్ కొలిన్ హువాంగ్ ఉన్నారు. చైనా బిలియనీర్ల జాబితా నుంచి ఈసారి సుమారు 142 మంది ఔటయ్యారు. సంపన్నుల జాబితాలో చైనా రియల్ ఎస్టేట్ రంగం దిగ్గజాల సంఖ్య తగ్గిపోయింది. మరోవైపు ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి సంపన్నుల జాబితాలో చోటు సంపాదించే వారి సంఖ్య పెరిగింది.