మార్చి 17 వ తేదీ ఆదివారము జరిగిన డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ”నెలనెల తెలుగువెన్నెల” ,తెలుగు సాహిత్య వేదిక 201 వ సాహిత్య సదస్సులో ”ఆధునిక సాహిత్యంలో – హాస్య వ్యంగ్య కవిత్వం ”అంశంపై నిర్వహించిన సదస్సు చాలా బాగా జరిగింది. పలువురు సాహితీప్రియులు అంతర్జాలములో పాల్గొనడం ద్వారా జరిగిన ”నెలనెలా తెలుగు వెన్నెల” ,తెలుగు సాహిత్య వేదిక ప్రారంభ సూచికగా భక్తి గీతము ”వినరో భాగ్యము విష్ణు కథా ”అనే అన్నమయ్య కీర్తనను శ్రీ లెనిన్ వేముల గారు రాగయుక్తంగా వీనుల విందుగా పాడి సాహితీ ప్రియులను భక్తితత్వం వైపు నడిపించారు… తన మధుర కంఠంతో కార్యక్రమ ప్రారంభాన్ని శోభాయమానం చేసిన శ్రీ లెనిన్ వేముల గారిని పలువురు సాహితీ ప్రియులు అభినందించడం జరిగింది.సంస్థ సమన్వయ కర్త శ్రీ లక్ష్మినరసింహ పోపూరి గారు, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థకార్యక్రమాల సలహాదారు డాక్టర్ దయాకర్ మాడా గార్ల సహకారము తో శ్రీలేనిన్ వేముల గారు నేటి సాహితీ సదస్సు అంతర్జాల ప్రసార ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.… తొలుత శ్రీ లెనిన్ వేముల గారు నేటి సాహితీ సదస్సు లో పాల్గొంటున్న ముఖ్య అతిథి, ప్రముఖ సాహితీ వేత్త ,ప్రపంచ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారిని సాహితీ ప్రియులకు పరిచయం చేస్తూ ఆయన అంతర్జాతీయ వేదికలనుండి తెలుగు భాషా సాహిత్య వికాసాన్ని ప్రజ్వలింప చేస్తున్న అంతర్జాతీయ కవిగా గుర్తింపు పొంది నెల్లూరు జిల్లాకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెడుతున్న కవిగా వారిని ప్రస్తుతించారు. . డాక్టర్ పెరుగు రామకృష్ణ తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం టాంటెక్స్ రెండునెలల క్రితం నిర్వహించిన 199 వ సాహితీసదస్సులో తాను తొలిసారిగా పాల్గొనడం జరిగిందన్నారు.. మహాకవి తిక్కన, నడయాడిన నేల నెల్లూరు నుండి మరీముఖ్యంగా చెప్పాలంటే కవికోకిల దువ్వూరు రామిరెడ్డి గారు ,దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు,వేదం వెంకట రాయ శర్మ గారు వంటి అత్యంత ప్రతిభావంతులు ప్రపంచ సాహిత్యాభిమానులకు తెలుగు భాషలో అందించిన కవిత్వ పరంపరను కొనసాగిస్తూ తాను సాహిత్య ప్రయాణం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ,తన గురుతుల్యులు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు మరియు తన తల్లిదండ్రుల ఆశీస్సులతో భారత దేశములోను అనేక ఇతర దేశాలలోను తెలుగు కవితా వాణిని వినిపించి అంతర్జాతీయ కవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు . పిన్న వయసునుండీ , వ్యంగ్య హాస్య చిత్రాలనుగీయడం తన అలవాటుగా పేర్కొన్నారు. . తాను ఈనాటి అంతర్జాల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని హాస్య కవిత్వమును గురించి విస్తృతంగా కీలక ఉపన్యాసం చేసే అవకాశం కలగడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు .మన జీవన శైలికి,సైబీరియన్ పక్షుల జీవన శైలికి దగ్గర పోలికలున్న విధానాన్ని దగ్గరగా గమనించి కవితా సంపుటిని వ్రాసిన కవిగా తన ప్రతిభను గుర్తించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం . తాను వ్రాసిన ”ఫ్లెమింగో ”కవితా సంపుటిలోని యాభై రెండులైన్ల కవితా భాగాన్ని .2023 వ సంవత్సరంలో ”కృష్ణ గీతికలు”’శీర్షికతో తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య అంశముగా ప్రవేశ పెట్టడం తనకు ఎనలేని తృప్తినీ ,గౌరవాన్నిమిగిల్చినట్లు పేర్కొన్నారు.తెలుగు లో హాసం అనే పదానికి నవ్వు అని అర్ధం వస్తుందనీ., ప్రతిభావంతమైన హాస్యం హృదయాలను రంజింప చేస్తుందన్నారు.ఆరోగ్యానికి మానసిక వికాసానికీ నవ్వు ఎంతో దోహదం చేస్తుందనడం లో ఎట్టి సందేహము లేదన్నారు.. హిందీ వంటి ఇతర భాషలలో హాస్య కవిత్వానికిస్తున్న ప్రాధాన్యతను ,హాస్యకవి సమ్మేళనాలలో వ్యంగ్య హాస్య కవుల కిచ్చే ఇతోధిక ప్రోత్సాహక వివరాల్ని తెలియ చేశారు డాక్టర్ పెరుగు రామకృష్ణ . .తెలుగు సాహిత్యంలో ప్రాచీన కవుల నుండి జంధ్యాల వంటి నేటి ఆధునిక కవుల వరకు పేరు పేరునా గుర్తుచేసుకొంటూ ఆయా కవుల హాస్య కవిత్వ పరిణామ క్రమాన్ని చక్కగా వివరించారు డాక్టర్ పెరుగు రామ కృష్ణ ..శ్రీనాధమహా కవి వ్రాసిన హాస్య పద్యకవిత్వాన్ని ,రాయల వారికాలములో తెనాలి రామకృష్ణ కవిరచించిన హాస్యపూరిత పద్యాలను ప్రస్తావించడమే కాక , రాయలవారి”ఆముక్త మాల్యద ”వంటి రచనలలోని హాస్య రసపోషణను కూడా వెలికి తీసి అద్భుతంగా చదివి వినిపించారు డాక్టర్ పెరుగు రామకృష్ణ . .ఆచార్య తూమాటి దోణప్ప గారన్నట్లు, మహాభారతం వంటి ప్రాచీన కావ్యాలను పరిశీలించినట్లయితే ఆకాలంలో వ్యంగ్య హాస్య కవిత్వానికి చాల పరిమితంగా ప్రాధాన్యత ఇచ్చినట్లు మనము గమనించ వచ్చునన్నారు . ఆధునిక సాహిత్యంలో అద్భుతంగా సామాజిక సమస్యల ను ,మధ్య తరగతి కుటుంబ సమస్యల ను ప్రస్తావిస్తూ .శ్రీ జనార్ధన మహర్షి కలం నుండి జాలు వార్చిన ”వెన్నముద్ద” ”ఆమెడ” వంటి హాస్య వ్యంగ్య రచనలను క్లుప్తంగా వివరించారు డాక్టర్ పెరుగు రామకృష్ణ , వచనంలో హాస్యాన్ని పండించి , గొప్ప సంఘ సంస్కరణోద్యమ అస్త్ర కర్త గా పేరొందిన కందుకూరి వీరేశ లింగం గారు,చిలక మర్తి లక్ష్మీ నరసింహం గారు , ,తిరుపతి వెంకట కవులు,అనంత పంతుల రామలింగ స్వామి గారు ,కృష్ణ శాస్త్రి గారు, ,భోగరాజు నారాయణమూర్తి గారు ,పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు, గురజాడ అప్పారావు గారు,వేదము వెంకట రాయ శాస్త్రి గారు,శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,విశ్వనాధ సత్యనారాయణ గారు,భమిడి పాటి కామేశ్వర రావు గారువంటి మహనీయులైన ఆధునిక కవులు వ్రాసిన అనేక వ్యంగ్య సాహిత్య రచనల విశేషాల్నీడాక్టర్ పెరుగు రామకృష్ణ గారు సోదాహరణంగా వివరించారు.అనర్గళంగా ఉపన్యసించిన డాక్టరు పెరుగు రామకృష్ణ గారిని శ్రీ లెనిన్ వేముల గారు ,డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి ,శ్రీమతి కాశీనాధుని రాధ గారు ,గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు గొప్పగా ప్రశంసించడం జరిగింది.
అనంతరం స్టేటు బ్యాంక్ ఆఫ్ఇండియా లో పనిచేసి రిటైర్ అయిన శ్రీ గుళ్ళపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ సాహిత్యం పై మక్కువతో తాను తెలుగులో వ్రాసిన ఆరు చిరు కవితలను చదివి వినిపించారు. ఆ కవితలను విన్నశ్రీ లెనిన్ వేముల వంటి సాహితీ ప్రియులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కవితా నైపుణ్యాన్ని మెచ్చుకోవడం జరిగింది.
తరువాత తిరుపతి జిల్లా గూడూరులో శ్రీ విజయ దుర్గ పీఠాధిపతులు వెదురుపాక గాడ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి ఉపపీఠాన్ని ఏర్పాటు చేసి ప్రతినిత్యం శ్రీ చక్ర అర్చన ప్రతినిత్యం రుద్రాభిషేకం ప్రతినిత్యం శ్రీ అమ్మవారి నవావరణ హోమం నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ కుమార్ కోట గారు ””శ్రీ శంకర భగవత్ పాదుల ” సౌందర్య లహరి” లోని మహిమాన్వితమైన 20 వ శ్లోకాన్ని మంత్రయుక్తంగా ప్రవచించడం జరిగింది. ,ప్రతి ఒక్కరూ తమ జన్మ కారకులైన తల్లిదండ్రుల ను నిత్యం పూజించుకొని వారి ఆశీస్సులను పొందవల సిన ఆగత్యాన్ని వివరిస్తూ ఒక కథను చెప్పి న డాక్టర్ కోట సునీల్ కుమార్,ఆధ్యాత్మిక స్థితిని, శ్రీ చక్ర ముద్ర, ,ఖడ్గమాల ,నిత్య చైతన్య సదాశివ భక్తి భావాన్ని అలాగే సౌందర్య లహరిని మనకు అందించడంలో శ్రీ శంకరాచార్యుల వారి ముఖ్యోద్ద్దేశాన్ని అత్యద్భుతంగా వివరించారు.సేవా తత్పరకు అంకితమై క్షణం తీరిక లేకున్నప్పటికీ నేటి అంతర్జాల సదస్సులో తమ అమూల్యమైన వాణిని వినిపించినందుకు డాక్టర్ సునీల్ కుమార్ గారికి టాంటెక్స్ సాహితీ సదస్సు సభ్యు లు శ్రీ లెనిన్ వేముల గారు ,శ్రీ గోవర్ధనరావు నిడిగంటి కృతజ్ఞతలు తెలియ చేశారు.
సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గత 71 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ”మన తెలుగు సిరి సంపదలు”అందరినీ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చెయ్యాలనే శుభ సంకల్పంతో ప్రారంభించిన ధారావార్షికశీర్షిక ”మనతెలుగుసిరిసంపదలు”.చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు,జాతీయాలు పొడుపు కథలతో సహా దాదాపు యాభై ప్రక్రియల సమాహారమే ఈ శీర్షిక ప్రత్యేకత. స్థానిక,ప్రాంతీయ ,జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందిన ,పొందుతున్న ఈ శీర్షికలో వైవిధ్య భరితమైన తెలుగు భాషా ప్రయోగాలను స్పృశించడం డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి వారి మరొక ప్రత్యేకత.,
అనంతరం ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి కాశీనాధుని రాధ గారు ప్రతిమాసం నిర్వహిస్తున్న ”నెల నెలా పద్య సౌగంధం ” కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ సాహిత్యం లోని లోతుపాతులు., భాషలోని పదాలనువాటి అర్ధము ను అందరితో పంచుకోవాలనే సదుద్దేశంతో బమ్మెర పోతన విరచిత భాగవతము లోని అష్టమ స్కంధము, లోని””వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సం వాసస్థలంబెయ్య? దియ్యెడకున్… గల్యాణ మిక్కాలమున్.”అనే పద్యాన్నిరాగయుక్తంగా చదివి వినిపించారు..వామన రూపములో ప్రకాశించుచున్న నారాయణుడికీ , బలి చక్రవర్తికీ మధ్య జరిగిన సంభాషణను పద్య రూపంలో చదివి పద్యములో వాడబడిన పదాలనూ,తెలుగు అర్ధ తాత్పర్యాలను విశ్లేషించి, అభ్యాసము వలన కలిగే సమర్ధత ను వివరిస్తూ అద్భుతం గా ప్రసంగించారు శ్రీమతి కాశీనాధుని రాధ గారు.
ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు మరియు సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులతోపాటు శ్రీ లెనిన్ వేముల గారు నేటి ముఖ్య అతిథి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి కి టాంటెక్స్ సంస్థ తరపున సమర్పించిన సన్మాన పత్రము జ్ఞాపిక ను చదివి వినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. సన్మానగ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు మాట్లాడుతూ అమెరికాదేశం లో ఉన్నప్పటికీ వ్యంగ్య హాస్య రచనల విశిష్టతను గుర్తించి టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారుగారు,శ్రీ లెనిన్ వేముల గారు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థ కార్యక్రమాల సలహాదారు డాక్టర్ దయాకర్ మాడా గారు,సమన్వయకర్త శ్రీ లక్ష్మీ నరసింహ పోపూరి గారు ,,శ్రీ లెనిన్ వేముల గారు ఇంకా అనేక మంది సాహితీ ప్రియులు, ఇంతమంది మధ్య తనను సన్మానించి ప్రోత్సహించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈసందర్భంగా హాస్య కవులలో కొందరు మహానుభావుల పేర్లను జ్ఞాపకము చేసుకొనే అవకాశం కలిగినందుకు సంతోషము గా ఉందన్నారు.అలాగే ఇక్కడి ప్రవాసభారతీయులు అందరూ కలిసి ఒక అంతర్జాతీయ హాస్య కవి సమ్మేళనాన్నిజరిపి వ్యంగ్య హాస్య కవుల వైభవాన్ని ప్రపంచం గుర్తుంచుకునేలా చేయడానికి పూనుకోవాలనేది తన కోరిక అని అన్నారు. ఇంతగా ఆదరించిన టాంటెక్సు సాహితీ సభ్యులందరికీ డాక్టర్ పెరుగు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారు సంస్థ పూర్వాధ్యక్షులు ,డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గారు, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ వీర్నాపు చిన్న సత్యం గారు ,ఇంకా శ్రీ లెనిన్ వేముల గారు , శ్రీమతి కాశీనాధుని రాధగారు , డాక్టర్ సునీల్ కుమార్ కోట గారు,శ్రీమావిళ్ల రంగయ్య గారి లోకనాధం గారు,శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, ,, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు అనేకమంది అంతర్జాలంద్వారా జరవడంతోసదస్సువిజయవంతమైంది. తమ వంతు కృషి చేసి ఈ సదస్సును విజయ వంతం చేసిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారు,బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థ కార్యక్రమాల సలహాదారు డాక్టర్ దయాకర్ మాడా గారు,శ్రీ లెనిన్ వేముల గారు, సంస్థ సమన్వయ కర్త శ్రీ లక్ష్మి నరసింహ పోపూరి గారు మరియు టాంటెక్స్ పాలకమండలి సభ్యులు అభినందనీయులు.