హైదరాబాద్‌లో భూముల ధర మరో రికార్డు సృష్టించింది. రాయదుర్గం పాన్మక్తాలోని ప్లాట్ నంబర్ పీ1కు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.264 కోట్లు పలికింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 5.25 ఎకరాల భూమిని విక్రయించడం ద్వారా టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. నిజానికి పీ1 ప్లాట్‌కు తొలుత ఎకరాకు రూ.175 కోట్ల చొప్పున రిజర్వ్ ధర నిర్ణయించారు. కానీ పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు రూ.264 కోట్ల ధర పలికింది. ఇది రిజర్వ్ ధర కంటే దాదాపు 51% అధికమని అధికారులు తెలిపారు.

ఇదే ప్రాంతంలో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్లు రాగా మూడు నెలల్లోనే రికార్డు ధర పలికినట్టు టీజీఐఐసీ ఎండీ శశాంక తెలిపారు. ప్రముఖ లగ్జరీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంస్థ ఎంఎస్ఎన్ రాయదుర్గంలో నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని ఎకరా రూ.264కోట్లకు దక్కించుకున్నది. ఇదే సంస్థ గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన వేలంలో పాల్గొని ఎకరా రూ.177 కోట్లకు దక్కించుకున్నది.

హైదరాబాద్‌పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఇది స్పష్టం చేస్తోందని టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కె.శశాంక చెప్పారు. పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు.















