ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. సీఎం యూఎస్ పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో సీఎం పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతిని కోరింది. లండన్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గురువారం అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సి ఉంది.

అయితే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. రాజకీయ కోణంలో అనుమతి ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని సీఎంవో కార్యాలయం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. లండన్ నుంచి ఎల్లుండి నేరుగా హైదరాబాద్ రానున్నారు. షెడ్యూల్ ప్రకారం అమెరికా వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయాలతో ఎంవోయూలు పూర్తి చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.















