వినాయక చవితి వేడుకలకు మరో వారం రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్థానిక ఇండియన్ కమ్యూనిటీ నాయకుల నుంచి కీలక సూచనలు అందుతున్నాయి. వినాయక చవితి వేడుకల్ని భారతీయులు తమ ఇంట్లోనే కుటుంబంతో కలిసి మాత్రమే జరుపుకోవాలని సూచిస్తూ ఒక మెసేజ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో సర్క్యులేట్ అవుతోంది. ఈ అలర్ట్ మెసేజ్ ప్రకారం గణేష్ చతుర్థి వేడుకల్ని ఇంట్లోనే జరుపుకోవాలి.

అపార్ట్‌మెంట్లు, కాలనీ, పబ్లిక్ ప్లేసుల్లో సామూహికంగా వేడుకలు జరుపుకోకూడదు. ఎవరైనా మిమ్మల్ని వేడుకలకు ఆహ్వానిస్తే ఇంట్లోనే జరుపుకొంటామని వారికి చెప్పండి అంటూ ఆ మెసేజ్‌లో ఉంది. అలాగే, కంటెంట్ క్రియేటర్లకు కూడా పలు సూచనలు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, గ్రూప్ వీడియోలు, రోడ్ సైడ్ సెలబ్రేషన్స్ వంటివి కూడా పోస్ట్ చేయకూడదు. మండపాలు వేసుకోవడం, ఎక్కువ మంది చేరి గుంపుగా, భారీ శబ్దంతో వేడుకలు జరుపుకోవడం, రోడ్డుపై సెలబ్రేషన్స్ చేయడం, నదుల్లో విసర్జనం చేయడం వంటివి కూడా చేయకూడదని సూచించారు. శాంతియుతంగా వేడుకలు జరుపుకొని, స్థానిక రూల్స్ ఫాలో అవ్వాలి అంటూ అందులో పేర్కొన్నారు.















