Skip to main content

Namaste NRI

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా .. తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు : జయ పీసపాటి

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా, సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం సింగపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు.

హాంకాంగ్‌లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఇటీవల మలేసియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్‌మార్క్‌గా నిలిచాయని ఆమె అభినందించారు.

అనంతరం రత్న కుమార్ మాట్లాడుతూ జయ పీసపాటితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2016లో తొలిసారి పరిచయమైనప్పటి నుంచి జూమ్ వేదికగా నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా హాంకాంగ్ తెలుగు సమాఖ్యతో తమ అనుబంధం మరింత బలపడిందని తెలిపారు. జయ పీసపాటి ఇప్పుడు మా అందరికీ ఆత్మీయమైన జయక్కగా మారిపోయారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆమె సలహాలు, సూచనలు తీసుకోవడం మాకు ఎంతో సహజంగా మారింది. ఆమె ప్రసంగాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలు మాకు ఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయి అని పేర్కొన్నారు.

సుబ్బు వి.పాలకుర్తి ఆధ్వర్యంలో సరిగమ గ్రాండ్ రెస్టరంట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత , మాధవి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News