Skip to main content

Namaste NRI

అమెరికా వెళ్లాలనుకుంటున్నారా?.. వీసా ఇంటర్వ్యూకే ఏడాది నిరీక్షణ?

అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసే భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలకు యూఎస్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ దక్కడం ప్రస్తుతం అత్యంత సవాల్‌గా మారుతోంది. భారతీయ దరఖాస్తుదారులు విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ పొందడానికి సగటున 346 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది.ఈ నిరీక్షణ సమయం కేవలం 42 రోజులుగా మాత్రమే ఉండేది కానీ ప్రస్తుతం ఇది దాదాపు ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక వీసాల కోసం అత్యధిక కాలం వేచి ఉండాల్సిన దేశాల జాబితాలో భారత్ ఏడవ స్థానంలో నిలిచింది. ఈ తీవ్రమైన జాప్యం కారణంగా కేవలం ప్రయాణికులే కాకుండా అమెరికా పర్యాటక రంగం కూడా ఆర్థికంగా భారీ నష్టాలను ఎదుర్కొంటోంది.

భారతదేశంలో వీసాల కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నప్పటికీ దానికి తగినట్లుగా కాన్సులర్ అధికారులను నియమించకపోవడం ఈ సుదీర్ఘ ఆలస్యానికి ప్రధాన కారణం అవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోని యూఎస్ ఎంబసీలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను పరిశీలించడానికి కేవలం 68 మంది అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరు ఏకంగా 14.55 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి రావడంతో ఒక్కో అధికారిపై సగటున 21,401 దరఖాస్తుల పనిభారం పడింది. చైనా వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లోని అధికారులపై ఉన్న ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. చైనాలో తక్కువ దరఖాస్తులకు ఎక్కువ మంది అధికారులు ఉండటంతో అక్కడ నిరీక్షణ సమయం కేవలం 34 రోజులుగా మాత్రమే ముగిసింది.

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిలో కొంతమంది దీనిని ఒక సామాజిక హోదాగా భావించడం కూడా దరఖాస్తుల పరిశీలన మరింత ఆలస్యం కావడానికి కారణమవుతోంది. నిజమైన ప్రయాణ ఉద్దేశం లేని ఇలాంటి దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించడానికి అదనపు సమయం పడుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ 346 రోజుల సమయం అనేది కేవలం ఒక సగటు గణాంకం మాత్రమేనని ప్రతి దరఖాస్తుదారునికి ఇదే వర్తించదని నివేదిక వివరించింది. దరఖాస్తు కేటగిరీ అలాగే అపాయింట్‌‌మెంట్ లభ్యతను బట్టి వాస్తవ నిరీక్షణ సమయం మారే అవకాశం ఉంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events