ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ తెలంగాణ మహిళ అరుదైన ఘనత సాధించారు. అత్యంత కీలకమైన స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన కర్రి సంధ్యారెడ్డి (శాండీ రెడ్డి) ఎన్నికయ్యారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ విజయంతో తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాలో మేయర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. మేయర్‌గా సంధ్యారెడ్డి సెప్టెంబర్ 2028 వరకు పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఒక పెద్ద బాధ్యత. కౌన్సిలర్లు, సిబ్బంది, ప్రజల సహకారంతో మన ప్రాంతాన్ని జీవించడానికి, పనిచేయడానికి మరింత అద్భుతమైన ప్రదేశంగా మారుద్దాం అని తెలిపారు.

సంధ్యారెడ్డి నేపథ్యం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌తో ముడిపడి ఉంది. ఆమె స్టాన్లీ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేశారు. 1991లో వివాహం అనంతరం భర్త కర్రిరెడ్డితో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లి, అక్కడ ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడ్డారు. కేవలం వృత్తికే పరిమితం కాకుండా, ఆమె స్థానిక సమాజ సేవలో చురుకుగా పాల్గొన్నారు. 2021లో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్‌గా ఎన్నికై, 2023లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2020లో స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సంధ్యారెడ్డి బంధువు.

ఆస్ట్రేలియా రాజకీయ చరిత్రలో ఓ తెలంగాణ మహిళ ఈ ఉన్నత స్థాయికి ఎదగడం ఇదే తొలిసారి. ఖండాంతరాల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన సంధ్యా రెడ్డికి ప్రవాస భారతీయుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.















