దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రా అండ్ రస్టిక్ చిత్రం అనకాపల్లి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం దిశగా దూసుకుపోతోంది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకు వస్తున్న ఈ అపూర్వ స్పందన నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం ఘనంగా థాంక్యూ మీట్ నిర్వహించింది.ఈ వేడుకలో ప్రముఖ నటుడు, నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ అనకాపల్లి సినిమా ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన కుమారుడు విక్రమ్ ఈ చిత్రంలో నటించడం, త్రినాథరావు నక్కిన, నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు.

ప్రముఖ దర్శకుడు, నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ తాను ఈ సినిమాకు ఎలాంటి డబ్బులు పెట్టలేదని, కేవలం తన పేరుతో ప్రేక్షకులకు సినిమా చేరువవుతుందనే ఉద్దేశంతో పేరు వాడుకున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ త్రినాథరావు నక్కిన మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాను సుమారు రెండు వందల థియేటర్లలో విడుదల చేశామని తెలిపారు. తాము ఎంతో కష్టపడి మంచి సినిమాను తీశామని, అయితే ఇలాంటి మంచి చిత్రాలకు కాకుండా ఇతర భాషల చిత్రాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించడం బాధాకరమన్నారు. నటి ఇంద్రజ మాట్లాడుతూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారని, అసలు సిసలు విజయం సాధించినందుకే తాను ఈ థాంక్యూ మీట్‌కు వచ్చానని తెలిపారు. అయితే, ఇంత మంచి చిత్రానికి సరిపడా థియేటర్లు ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.















