మహాత్మా గాంధీ మనవడు కానూ గాంధీకి చెందిన భూమి కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ భూమిని కబ్జా చేసిన వర్జీనియా నివాసితుడిని అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోర్టు ఆదేశించింది. దివంగత జంట కానూ గాందీ, ఆయన భార్య శివా గాంధీ తరపున సూరత్‌కు చెందిన పరిమల్ దేశాయ్ అమెరికా కోర్టులో 30 ఎకరాల స్థలం కోసం పోరాటం చేశారు.

వర్జీనియాలోని వారెన్ కౌంటీలో ఉన్న షేనాదోబా నేషనల్ పార్క్ సమీపంలో ఆ స్థలం ఉన్నది. 1987లో కానూ గాంధీ ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన తన చివరి దశలో దక్షిణ గుజరాత్లో గడిపారు. ఆ సమయంలో ఓ ఛారిటబుల్ ట్రస్టును నమోదు చేసి, దానికి తన ఆస్తులను బదిలీ చేశారు. ఆ ట్రస్టుకు ఇప్పుడు దేశాయ్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.

అమెరికాలోని 30 ఎకరాల కేసు గురించి పరిమల్ దేశాయ్ మీడియాతో వెల్లడించారు. అమెరికా జాతీయుడు గ్రెగరీ బ్లాక్ అనే వ్యక్తి తన ఇంటికి 2025 జనవరి 10న నోటీసు పంపారని, వర్జీనియాలో ఉన్న ఆ భూమి తన పొజిషన్లో ఉన్నట్లు ఆ నోటీసులో పేర్కొన్నాడని తెలిపారు. 15 ఏళ్లుగా ఆ స్థలం తన ఆధీనంలో ఉన్నట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే కోర్టులో మాత్రం ఆ విషయాన్ని బ్లాక్ నిరూపించలేకపోయినట్లు పరిమల్ దేశాయ్ మీడియాతో తెలిపారు.

కానూ గాంధీ, శివా గాంధీలు 2013లో భారత్‌కు తిరిగివచ్చేశారు. కానూ గాంధీ 2016 నవంబర్‌లో సూరత్‌లో ప్రాణాలు విడిచారు. ఆయన రాసిన వీలునామా ప్రకారం ఆస్తులన్నీ శివా గాంధీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. శివా గాంధీ 2018లో ట్రస్టును ఏర్పాటు చేశారు. దానిపై ఆమె తన వీలునామాను రిజిస్టర్ చేశారు. 2020లో శివా గాంధీ మరణించారు. ఆ తర్వాత ఆ ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీగా దేశాయ్ బాధ్యతలు స్వీకరించారు. స్వచ్ఛంధ కార్యక్రమాల నిర్వహణ కోసం ట్రస్టు ప్రాపర్టీలను స్వాధీనం చేసుకుంటోంది.

2024లో తొలిసారి వర్జీనియా వెళ్లినట్లు దేశాయ్ చెప్పారు. సుమారు 4500 డాలర్లు ఖర్చు చేసి సర్వే చేయించినట్లు చెప్పారు. 2025లో అమెరికా కోర్టులో వీలునామాను సమర్పించినట్లు చెప్పారు. ఆ తర్వాత ట్రస్టు పేరిట ఆ భూమికి టైటిల్ చేసినట్లు తెలిపారు. అయితే ఆ 30 ఎకరాల స్థలంలో 2008 నుంచి ఉంటున్నట్లు బ్లాక్ వాదించారు. ప్రాప్టరీలో మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇక తుది దశ విచారణ జరుగుతున్న సమయంలో కానూ గాంధీ, మహాత్మా గాంధీ మనవడు అని కోర్టు చెప్పినట్లు పరిమల్ తెలిపారు. ఆ స్థలాన్ని ట్రస్టుకు ఆ దంపతులు విరాళం ఇచ్చారని, గాంధీ తత్వ ప్రచారం కోసం ఆ నిధులను వాడనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 21న జడ్జీ డారిల్ ఎల్ ఫంక్ తన తీర్పును దేశాయ్‌కి అనుకూలంగా వెల్లడించారు.














