
అమెరికాలోని సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు, రిఫ్రిజరేటర్లు అకస్మాత్తుగా పనిచేయకపోవడం, వాటిలో నిల్వ చేసిన ఆహారపదార్థాలు పాడైపోవడం కలకలం రేపింది. దీని వెనుక సైబర్ దాడి ఉందా? అన్న కోణంలో అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టులో కనీసం ఆరు సైనిక స్థావరాల్లోని ఆహార విక్రయ కేంద్రాల్లో ఈ సమస్య తలెత్తింది. ఫ్రీజర్లను సాధారణంగా ఆపివేయడమే కాకుండా, వాటిని డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మార్చి లోపలి ఉష్ణోగ్రతలను పెంచినట్టు అనుమానిస్తున్నారు. అరిజోనాలోని ఫోర్ట్ హువాచుకా సైనిక స్థావరంలో ఆగస్టు 26న ఫ్రీజర్లు డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మారడంతో అందులోని ఘనీభవించిన ఆహార పదార్థాలన్నీ పాడైపోయినట్టు అధికారులు వెల్లడించారు.















