అమెరికాలో ఓ భారత సంతతి మహిళ చరిత్ర సృష్టించారు. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ, శ్వేతజాతీయేతరాలుగా ఆమె చరిత్రకెక్కారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆమె నియామకాన్ని ధృవీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన బెండపూడి ఉన్నత విద్య కోసం 1986 అమెరికాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె లూయిస్ విల్లే యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గాను, వర్శిటీ అధ్యక్షురాలిగాను కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డిసెంబర్ 9న ఆమెను వర్శిటీ తదుపరి అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. 2022లో ఆమె ఈ పదవి చేపట్టనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బెండపూడి ఆనందం వ్యక్తం చేశారు.
అయితే ఆమె వచ్చే ఏడాది 2022లో పెన్ స్టేట్ 19వ ప్రెసిడెంట్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు నీలి బెండపూడి మాట్లాడుతూ పెన్ స్టేట్ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం. ఈ అత్యుత్తమ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి పనిచేయడాన్ని నెనెంతో గర్వంగా భావిస్తున్నా. అంతేకాదు పెన్ స్టేట్ యూనివర్సిటీని కొత్త శిఖరాలకు చేరుకునేలా పనిచేయడమే నా ధ్యేయం అని అన్నారు.