రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు, బాంబు దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ పరిస్థితులు, దేశ భద్రత అంశాలపై ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత ఉక్రెయిన్ ఎంబసీని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.తరువాత పరిస్థితులనే బట్టి, మరిన్ని నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.