Namaste NRI

మాతృభాషలోనే చదివి నేను ఈ స్థాయికి ఎదిగాను : జస్టిస్‌ ఎన్వీ రమణ

మాతృభాషలోనే చదివి నేను ఈ స్థాయికి ఎదిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తెలుగు ప్రజల్లో తాను ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, ఎన్నో దశల్లో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారన్నారు. మాతృభూమిని సొంత మనుషులను వదులుకొని ఇక్కడ ఉంటున్నారని పేర్కొన్నారు. ఆచార వ్యవహరాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని కొనియాడారు. మీ నిబద్ధత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్తు సురక్షితమని విశ్వసిస్తున్నానని అన్నారు.

                మన భాష, సంస్కృతిని మరిచిపోతే జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి రావడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషలోనే చదివితే ఉద్యోగాలు రావనేది కేవలం అపోహ మాత్రమే. నేను మాతృభాషలో చదివి ఈ స్థాయికి వచ్చాననేది మర్చిపోవద్దు. జాషువా, దాశరథి, శ్రీశ్రీ వంటి మహానుభావులు వెలకట్టలేని సంపద ఇచ్చారు. తెలుగు కళారంగాన్ని ప్రభావితం చేసిన ఎన్టీఆర్‌ శతజయంతి ప్రారంభమైంది. ఎన్టీఆర్‌, ఘంటశాల ఉచ్ఛారణ మా తరానికి అలవడిరది. ఈ సందర్భంగా వారికి నివాళి ఘటిస్తున్నామన్నారు.

                అమెరికాలోని తెలుగువారు సంపద సృష్టిస్తున్నారని చెప్తుండడం గర్వకారణం. తెలుగు అనేది కేవలం భాష కాదు, జీవన విధానం. మాతృభాష, మాతృభూమిలో ఉన్న ప్రేమను ఆస్వాదించాలి. మన భాషతో పాటు పరాయి భాషనూ గౌరవించాలి. మాతృభాష, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత. అమ్మభాషలోని తియ్యదనాన్ని అనుభావించాల్సిందే. మాటల్లో చెప్పలేం. ఇంట్లో పిల్లలతో పెద్దలు తెలుగులో మాట్లాడాలని కోరుతున్నా. తెలుగు సదస్సులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా సత్వర న్యాయం అందాలని ఆకాంక్షించారు. న్యాయ సమీక్ష చేసే అధికారం భారతదేశ న్యాయవ్యవస్థకు ఉందని తెలిపారు. రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా జడ్జిలు పని చేస్తారని తెలిపారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టులో తన హయాంలో తొమ్మిది మంది జడ్జిలను నియమించామని గుర్తు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events